Back

ⓘ రాణీ మంగమ్మ
రాణీ మంగమ్మ
                                     

ⓘ రాణీ మంగమ్మ

రాణీ మంగమ్మ తమిళ దేశములో మధుర రాజ్యమునేలిన తెలుగు బలిజ నాయకుల వంశమునకు చెందిన మహారాణి. పసివాడైన మనుమడి తరఫున రాజ్యభారము వహించి బహు పేరుప్రఖ్యాతులు బడసిన రాజనీతిజ్ఞురాలు. రాజ్యములో గుళ్ళు, గోపురములు, రహదారులు, చెరువులు మొదలగునవి ఏర్పరచి ప్రజారంజకమైన పరిపాలన గావించింది. రాజకీయ చతురతకు, దౌత్యానికి ప్రసిద్ధి చెందింది. పలు యుద్ధాలు చేసి విజయము సాధించింది. ఆమె కాలములో మధుర రాజ్యానికి రాజధాని తిరుచిరాపల్లి.

                                     

1. పరిచయము

మధుర రాజు చొక్కనాథ నాయుని క్రీ. శ. 1659-1682 వద్ద సేనాధిపతిగా ఉన్న చంద్రగిరి బలిజ నాయక రాజు తుపాకుల లింగమ నాయకుని కుమార్తె మంగమ్మ. మంగమ్మకు చొక్కనాథునితో వివాహమైనది. రాజుగారి మనసు తంజావూరి రాజైన విజయరాఘవ నాయకుని కుమార్తె పైన ఉన్నది కాని ఆ కోర్కె నెరవేరలేదు. 1682లో చొక్కనాథుని మరణము తరువాత ఆచారము ప్రకారము మంగమ్మ సతీసహగమనము చేయలేదు. ఆమె మనసు రాజకీయమువైపు మొగ్గుచూపినది.

                                     

2. అధికారము

మంగమ్మ కుమారుడగు రంగకృష్ణ ముద్దువీరప్ప నాయకుడు 1682 - 1689 పదునైదు సంవత్సరములకే రాజ్యభారము వహించాడు. మొఘల్ సుల్తాను ఔరంగజేబుని ధిక్కరించి రాజ్య విస్తరణకు పూనుకున్నాడు. అయితే కొద్దికాలానికే 1689లో అకాలమరణము చెందాడు. అప్పుడు ఆతని భార్య గర్భవతి. కష్టము మీద మంగమ్మ సతీసహగమనమును ఆపింది. మంగమ్మ ఎంతవారించినను వినక రాణి ప్రసవము తరువాత ప్రాణముతీసుకొన్నది. మనుమడు విజయరంగ చొక్కనాథుని పెంపకము మంగమ్మకు తప్పలేదు. మూడునెలల వయస్సులో మనుమడిని సింహాసనముపై కూర్చుండబెట్టి మంగమ్మ రాజ్యభారము స్వీకరించింది. 1689 నుండి 1705 వరకు సమర్ధవంతమైన పాలన అందించింది. ఆమెకు సహాయముగా దళవాయి నరసప్పయ్య ఉన్నాడు.

                                     

3. యుద్ధములు

మంగమ్మ రాజ్యభారము స్వీకరించు సమయనికి చుట్టూ శత్రువులున్నారు. వారిలో ముఖ్యులు మరాఠాలు, దక్కన్ సుల్తానులు, తంజావూరు నాయకులు, ముఘలులు. దక్షిణమున తిరువాన్కూరు రాజు కప్పము కట్టుట ఆపివేశాడు. రామనాధపురం రాజు సేతుపతి స్వతంత్రుడయ్యాడు. బయటి నుండి ఏవిధమైన సహాయము లేకున్ననూ తన బుద్ధి కుశలత, రాజకీయ చతురత, పరిపాలనా దక్షతలతో మధుర గౌరవాన్ని నిలబెట్టింది.

ముఘలులు

ఢిల్లీ సుల్తానుఔరంగజేబు దక్కనుపై పూర్తి అధికారము చిక్కించుకున్నాడు. ముఘల్ సేనాధిపతి జుల్ఫికర్ ఆలి ఖాన్ మరాఠాల నుండి జింజి సాధించుటకు దాడి చేస్తాడు. జింజి అంతకుముందు మధుర రాజులనుండి తంజావూరు రాజులు గెల్చుకున్నారు. మంగమ్మ తెలివిగా ముఘలులకు కప్పముగట్టి పూర్వము తంజావూరు రాజులకు కోల్పోయిన ప్రాంతములు తిరిగి సాధించుకొన్నది.

                                     

4. తిరువాన్కూరు రాజు

క్రీ. శ. 1697లో మంగమ్మ తిరువాన్కూరు రాజు రవి వర్మను లొంగదీయుటకు పెద్ద సైన్యము పంపింది. పలు దినములు సాగిన పోరు పిదప రవివర్మ లొంగిపోయి కప్పము చెల్లించుటకు సంధిచేసుకున్నాడు. పలు ఫిరంగులు మధుర, తిరుచిరాపల్లి కోటలకు చేర్చబడ్డాయి.

తంజావూరి పై యుద్ధము

మరుసటి సంవత్సరము 1698 దళవాయి నరసప్పయ్య తంజావూరునేలుతున్నమరాఠా రాజు షాజీ పై దండెత్తి కోటముట్టడిస్తాడు. షాజీ కాళ్ళబేరానికొచ్చి ఖజానా అంతయూఖాళీ చేసి నరసప్పయ్యకు ఆప్పగిస్తాడు.

మైసూరుపై యుద్ధము

క్రీ. శ. 1690-1694 మధ్య మైసూరునేలుతున్న చిక్కదేవ రాయలు మధుర రాజ్యానికి చెందిన సేలం, కోయంబత్తూరు ప్రాంతాలను ఆక్రమిస్తాడు. క్రీ. శ. 1700లో మంగమ్మ తంజావూరి వ్యవహారములు చక్కబెట్టిన పిదప మైసూరుపై దాడి చేస్తుంది. మైసూరు రాజు చేసిన ఆగడాలకు బుద్ధి చెప్తుంది.

                                     

5. చివరి పోరు

1702లో మంగమ్మ చేసిన చివరి యుద్ధము ఆమెకు కలిసి రాలేదు. స్వతంత్రుడైన రామనాధపురం రాజు రఘునాథ సేతుపతితో తలబడి పరాజయము పాలయ్యింది. ఈ యుద్ధములో దళవాయి నరసప్పయ్య మరణిస్తాడు.

                                     

6. పరిపాలన

మంగమ్మ పరిపాలన ప్రజారంజకమైనది. ఆమె తమిళ దేశ ప్రజల మనసులలో చిరస్థాయిగా నిలచిపోయింది. ఆమె త్రవ్వించిన కాలువలు, వేయించిన రహదారులు, నాటించిన చెట్లు అపారం. కన్యాకుమారి వరకు గల రహదారి మంగమ్మాళ్ శాలై ఇప్పటికీ ప్రసిద్ధము. మదురై, తిరునెల్వేలి మున్నగు చోట్లగల మంచి రహదారులన్నీ ఆమె పుణ్యమే. ప్రజల సౌకర్యార్ధమై ఎన్నో సత్రములు కట్టించింది. మదురైలోని మంగమ్మాళ్ సత్రము ఆమె కట్టించినదే. తాను నివసించిన తముక్కు రాజభవనము ఇప్పటి గాంధీ సంగ్రహాలయము. అచ్చటి విశాలమైన తముక్కు మైదానములో ఒకనాడు ఏనుగుల పోటీలు మొదలగు రాజవినోదాలు జరుగుతూ ఉండేవి.

                                     

7. అంతము

రాణి మంగమ్మ మరణము ఇప్పటికీ వివాదాస్పదము. 1704లో యుక్తవయస్సు వచ్చిన మనుమడు విజయరంగ చొక్కనాథ నాయుడు సింహాసనము అధిష్టించుటకు ఆమె సుముఖముగా లేదు. రాజభవనములో బందీగా అన్నపానాలు నిరాకరించబడి మరణించిందని ఒక కథనము.

                                     

8. బయటి లింకులు

  • Tamukkam Palace at Madurai,Now Gandhi Memorial Museum ఘాంధీ మెమోరియల్ మ్యూజియం
  • Madurai.com - రాణీ మంగమ్మ
  • హిందూ పత్రికలో రాణీ మంగమ్మ దర్బారు గురించి వ్యాసం The Hindu: Rani Mangammal Durbar Hall Palace at Trichy
  • "The Hindu: A town by the Vaigai హిందూ పత్రికలో వ్యాసం". The Hindu. Archived from the original on 2008-08-17. Retrieved 2008-06-14.
  • మదురై గురించి
                                     

9. కొన్ని ఆధార రచనలు

  • Velcheru Narayana Rao, and David Shulman, Sanjay Subrahmanyam. Symbols of substance: court and state in Nayaka period Tamilnadu Delhi ; Oxford: Oxford University Press, 1998 ; xix, 349 p.,: H. Milford, Oxford university press, 1924) ; xvi, 403 p. ; 21 cm. ; SAMP early 20th-century Indian books project item 10819.