Back

ⓘ రీవా
రీవా
                                     

ⓘ రీవా

రీవా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఈశాన్య భాగంలో ఉన్న నగరం. ఇది రీవా జిల్లా ముఖ్యపట్టణం, రీవా డివిజను పరిపాలనా కేంద్రం. నగరం రాష్ట్ర రాజధాని భోపాల్‌కు ఈశాన్యంగా 420 కి.మీ. జబల్‌పూర్ నగరానికి ఉత్తరంగా 230 కి.మీ దూరంలో ఉంది. ప్రపంచంలోని ఏకైక మహామృత్యుంజయ ఆలయం రీవా కోటలో ఉంది. ప్రపంచంలోని మొట్టమొదటి తెల్ల పులి ని 1951 లో రీవాలో మహారాజా మార్తాండ్ సింగ్ పట్టుకున్నాడు. రీవా అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ భారతదేశం లోనే కాక, ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్-సైట్ సౌర విద్యుత్ ప్లాంట్లలో ఒకటి.

                                     

1. జనాభా

2011 నాటికి, రీవా జనాభా 2.35.654. వారిలో 1.24.012 మంది పురుషులు, 1.11.642 మంది మహిళలు. రీవాలో సగటు అక్షరాస్యత రేటు 86.31%, పురుషుల అక్షరాస్యత 91.67%, స్త్రీల అక్షరాస్యత 80.40%. రీవా జనాభాలో 10.76% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు.

రీవా నగర జనాభాలో 95.93% మందితో హిందూ మతం మెజారిటీ మతంగా ఉంది. ఇస్లాం రెండవ అత్యంత ప్రాచుర్యం పొందిన మతం, దీనిని సుమారు 3.61% మంది అనుసరిస్తున్నారు. రీవా నగరంలో, క్రైస్తవ మతస్థులు 0.08%, జైన మతం 0.03%, సిక్కు మతం 0.04%, బౌద్ధమతాన్ని పాటించేవారు 0.04% మంది ఉన్నారు. సుమారు 0.01% మంది ఇతర మతం అని, సుమారు 0.26% మంది ప్రత్యేకంగా ఒక మతమంటూ ఏమీ లేదు అనీ పేర్కొన్నారు.

                                     

2. వాతావరణం

రీవాలో తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ఉంటుంది. చలిగా, పొగమంచుతో ఉండే శీతాకాలం, వేడి వేసవి, తేమతో కూడిన రుతుపవనాలు ఇక్కడ సాధారణం. వేసవికాలం మార్చి చివరలో ప్రారంభమై జూన్ మధ్య వరకు ఉంటుంది, సగటు ఉష్ణోగ్రత 30°C వరకు ఉంటుంది. మే నెలలో ఉష్ణోగ్రత గరిష్టంగా 45°C కి మించి ఉంటుంది. రుతుపవనాలు జూన్ చివరలో ప్రారంభమై సెప్టెంబరు చివరలో ముగుస్తాయి. ఈ నెలల్లో అవపాతం 1025 మి.మీ. వరకు ఉంటుంది. మొత్తం వార్షిక వర్షపాతం సుమారు 1128 మి.మీ. ఉంటుంది. సగటు ఉష్ణోగ్రత 25°C ఉంటుంది. తేమ చాలా ఎక్కువగా ఉంటుంది. శీతాకాలం అక్టోబరు చివరిలో ప్రారంభమై, మార్చి ఆరంభం వరకు ఉంటుంది. రీవాలో శీతాకాలాలు చల్లగా, పొగమంచుతో కూడుకుని ఉంటాయి. సగటు ఉష్ణోగ్రత 15°C ఉంటుంది. కొద్దిగా వర్షం. జనవరిలో కొన్ని రాత్రులలో ఉష్ణోగ్రతలు సున్నకు దగ్గరగా ఉన్నప్పుడు శీతాకాలం శిఖరస్థాయికి చేరుతుంది.

                                     

3. రవాణా

రీవా రైల్వే స్టేషన్ 50 కి.మీ. దూరంలో ఉన్న సత్నాకు, సత్నా-రీవా బ్రాంచ్ లైన్ ద్వారా అనుసంధానించబడి ఉంది. ఇది సత్నా హౌరా-అలహాబాద్-ముంబై మార్గంలో వస్తుంది.

జాతీయ రహదారి 7, జాతీయ రహదారి 27, జాతీయ రహదారి 75 లు నగరం గుండా పోతున్నాయి.

రీవాకు సమీపం లోని ప్రధాన విమానాశ్రయం 130 కిలోమీటర్ల 80.7 మైళ్ళు దూరంలో ఉన్న ప్రయాగరాజ్‌లో ఉంది. ఇక్కడి నుండి ఢిల్లీ, బెంగళూరు, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన గమ్యస్థానాలకు విమానాలు ఉన్నాయి. దగ్గరి లోని ఇతర విమానాశ్రయాలు చొరాటా విమానాశ్రయం రీవా, ఖజురహో, జబల్పూర్, వారణాసి.